గ్రామీణ నేప‌థ్యంలో పెరిగే పిల్ల‌ల విష‌యంలో ఈ క్రీడ‌ల ప‌రిజ్ఞానం కాస్త ఉంటున్నా.. న‌గ‌రాల్లో పెరిగే పిల్ల‌లు మాత్రం బాల్యంలో క్రీడ‌లపై ఆసక్తిని కోల్పోతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. ఇందుకు దోహ‌దం చేసే కార‌ణాలు చాలానే ఉన్నాయి. పెరుగుతున్న టెక్నాల‌జీ వినియోగం, పిల్ల‌ల‌ను క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకొనే దిశగా ప్రోత్స‌హించే తీరిక‌, ఓపిక త‌ల్లిదండ్రుల‌కు లేక‌పోవ‌డం.. వంటివి ఓవైపు కార‌ణాలైతే; ఆడుకోవాల‌ని అనిపించినా ప్లే గ్రౌండ్ , ఓపెన్ ప్లేస్ లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా కొంద‌రు పిల్ల‌లు ఈ ఆట‌ల‌కు దూర‌మ‌వుతున్నారు. క‌నీసం స్కూల్లో అయినా ఆడుకుందామంటే ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మ‌న‌కు తెలియ‌ంది కాదు.

 

పిల్లలన్నాక కదలకుండా బుద్ధిగా కూర్చుంటే ఏం బావుంటుంది చెప్పండి? వాళ్లు ఆటలు ఆడాలి...అల్లరి చేయాలి...ఇంట్లో వాళ్లని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాలి... ఆ పసితనపు అల్లరిలోని ఆనందమే వేరు. అంతేకాదు ఎదిగేకొద్దీ పిల్లలు ఆటలు ఎంత ఆడితే అంత అరోగ్యంగా ఉంటారు. వారి బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. అయితే ఈ ఆటపాటలు నేటి తరం పిల్లలు ఎంజాయ్‌ చేయడం లేదు. వాళ్ల తల్లిదండ్రులు బాల్యంలో ఆడినట్టు నేటి పిల్లలకు ఆడే అవకాశాలు ఉండడం లేదు. ఈ మాటలు ఏదో అలవోకగా చెప్తున్నవి కాదు. ఇటీవల పది దేశాల్లో చేసిన ఒక సర్వేలో భారత్‌లో పిల్లల ఆటపాటల పరిస్థితి సరిగా లేదని వెల్లడైంది. ఆ సర్వేలో ఇప్పటి పిల్లల కన్నా వారి తల్లిదండ్రులే తమ చిన్నతనంలో బాగా ఆడారని తేలింది. ఆరుబయట హాయిగా ఆడుకోవడం నేటి తరం పిల్లల్లో అపురూపమైంది.


 
ఇప్పటి పిల్లలకు ఆడే సమయమే ఉండడం లేదు. బడి అయిన తర్వాత ట్యూషన్లు, ట్యూషన్లు అయిన తర్వాత హోంవర్కులు... మళ్లా పొద్దున్న కాగానే బడికి ఉరుకులు పరుగులు. ఇవే వారి నిత్యకృత్యమైపోయాయి. బడికి వెళ్లినా అక్కడ ఆడుకునేందుకు ఆటస్థలం లేని పరిస్థితులు కూడా చూస్తున్నాం. ఒకవేళ ఉన్నా ఇతర దేశాల పిల్లలతో పోలిస్తే బయటకు వెళ్లి ఆడుకునే అవకాశాలు ఇక్కడి చిన్నారులకు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ సర్వేలో ప్రపంచంలోని సగంమంది పిల్లలు రోజులో ఒక గంట లేదా దానికన్నా తక్కువ సేపు ఆరుబయట ఆడుకుంటున్నారని వెల్లడైంది. పిల్లలు ఆరుబయట ఆడుకోవడం వల్ల వాళ్ల ఆరోగ్యం బాగుంటుంది. ఫిట్‌నెస్‌ పెరుగుతుంది. వీటితోపాటు పిల్లలు ప్రకృతిని ప్రేమించడం నేర్చుకుంటారు. వాళ్ల మెదళ్లు చురుగ్గా పనిచేస్తాయి. పిల్లలు ఆరుబయట ఆడుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా మనదేశంలో ఆరుబయట ఆడుకుంటున్న పిల్లలు బాగా తగ్గిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: